గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంపై సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు. ఇలాంటి ఘటనలు తరచూ జరగడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. అసలు పాపికొండలు అనే పేరు బాగోలేదని… ఇది ఒక అపశబ్ధమని ఆయన అభిప్రాయపడ్డారు.
పాపికొండలు అసలు పేరు పాపిడికొండలు అని… మహిళ పాపిడి తరహాలో నది ప్రవాహం ఉంటుందని కాబట్టి ఈ పేరు వచ్చిందని ఆయన వివరించారు. కాలక్రమంలో ఇది కాస్త పాపికొండలుగా మారిపోయిందని తెలిపారు.
పాపిడికొండలు పేరు బాగోలేకపోతే… రాముడు, సీత, హనుమంతుడు లేదా భద్రాద్రి పేరుతో పాపికొండల పేరు మార్చాలని ఆయన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
తాము పని చేసిన ఓ సినిమాకు మహాసంగ్రామం అనే పేరు పెట్టినప్పుడు కూడా కొందరు ఇలాంటి సలహా ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అపశబ్దం అనేది ఎవరికి శుభం కాదని అభిప్రాయపడ్డారు. భోజనం చేయడానికి లైఫ్ జాకెట్లు తీసిన వారు… భోజనం చేయకుండానే చనిపోయారని పరుచూరి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు అక్కడ ప్రైవేటు బోట్లు నడపకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పరుచూరి గోపాలకృష్ణ ప్రభుత్వానికి సూచించారు.
ఈ క్లిష్ట సమయంలో అంతా బాధితులకు అండగా ఉండాలని తెలిపారు.